news








=====================================================================
 
కాలేజీలు.. ఫర్ సేల్ అంగట్లో 50 ఇంజనీరింగ్ కళాశాలలు అరకొర అడ్మిషన్లు, రీయింబర్స్‌మెంట్స్‌పై అనుమానాలు



భవిష్యత్తులో నిర్వహణపై భయాందోళనలు
కార్పొరేట్ సంస్థలకు గంపగుత్తగా అమ్మే యత్నాలు
రూ.6 కోట్ల నుంచి 10 కోట్ల దాకా బేరాలు
స్థలం, సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్యను బట్టి ధర
హైదరాబాద్ శివార్లలోనే 30 కాలేజీలు అమ్మకానికి
నష్టాల కాలేజీల విలీనానికీ గ్రూపు సంస్థల ఎత్తుగడ
ఒకటోస్సారి... రెండోస్సారీ... మూడోస్సారీ... రండి బాబూ రండి! భలే మంచి చౌక బేరం.. మంచి తరుణం మించిన దొరకదు... ఇంజనీరింగ్ కాలేజీలు అమ్మకానికి సిద్ధం! మీరు సరిగ్గానే చదివారు... అమ్మకానికి సిద్ధంగా ఉంది కాలేజీలో సీట్లు కాదు... ఏకంగా కళాశాలలే!! అవసరానికి మించి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీలు కాస్తా ఇప్పుడు పరిస్థితులు అనుకూలించక బిచాణా సర్దేస్తున్నాయ్! లాభాల మాట దేవుడెరుగు.. అసలుకే ఎసరు రాకుండా ఉంటే చాలని భావిస్తున్నాయి. కొనుక్కునే వారు రెడీగా ఉంటే సర్వంసహా అమ్మకానికి సిద్ధమైపోతున్నాయి! ఏ కార్పొరేట్ సంస్థో కరుణించకపోతుందా అని దిగులుముఖం వేసుకుని చూస్తున్నాయి! ఇలా ఒకటికాదు.. రెండు కాదు.. రాష్ట్రంలో ఇప్పుడు 50 కాలేజీలు ఫర్ సేల్!!


హైదరాబాద్, జనవరి 25 : ఊరి శివార్లలో మూడు షెడ్లుంటే చాలు. ఒకటి ఆఫీసుకు, రెండోది క్లాసులకు, మూడోది ల్యాబొరేటరీ.. ఇంజనీరింగ్ కాలేజీకి అంతా సిద్ధమే! ఇక అనుమతులు తెచ్చుకోవడమే తరువాయి!! ఈ పాలసీతో ఒకప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలా వాటి మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సీట్లు భర్తీ కాకపోవడం, ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సందేహాలతో ఆయా కాలేజీల యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి.

ఒకవైపు బ్యాంక్ రుణాలు చెల్లించలేక, మరోవైపు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేక సతమతమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నష్టాల ఊబిలో కూరుకుపోవటం ఖాయమని బెంబేలెత్తుతున్నాయి. అయినకాడికి అమ్ముకుంటే ఇంతటితో బయటపడే వీలుందేమోనని ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని 720 ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 50 కళాశాలలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో గత నాలుగైదు సంవత్సరాల్లో ప్రారంభమైన కాలేజీలే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఆ కాలేజీల యాజమాన్యాలు కొంత కాలంగా కొనుగోలుదారుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. కొన్ని కాలేజీల్లో అయితే ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి తప్పుకునేందుకు భాగస్వాములు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అవసరాలకు మించి కాలేజీలు, సీట్లు ఉన్నందున ఇక ఇంజనీరింగ్‌లో లాభార్జన అసాధ్యమని వారు భావిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కాలేజీని రూ. 6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు అమ్మజూపుతున్నారు. కాలేజీ కింద సమకూర్చిన భూమి, భవన నిర్మాణాలు, ల్యాబ్ ఎక్విప్‌మెంట్, లైబ్రరీ, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని అమ్మకపు రేటును నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం.

ఈ రకంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాదాపు 30 వరకు కాలేజీలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరో 20 కాలేజీలను యాజమాన్యాలు బేరానికి పెట్టాయి. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అరడజను కాలేజీలు ఇతర విద్యా సంస్థల గ్రూపులో చేరాయి. కాగా.. రెండు, అంతకంటే ఎక్కువ కాలేజీలు ఉన్న యాజమాన్యాలు రాష్ట్రంలో 50 వరకు ఉన్నాయి.

ఇందులో 10 కాలేజీలున్న ఓ విద్యా సంస్థల గ్రూపు టోకుగా అన్ని కాలేజీలను ఓ కార్పొటేట్ కంపెనీకి విక్రయించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విద్యాసంస్థలన్నీ తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక... ఇంజనీరింగ్ కాలేజీలకు గిరాకీ బాగున్నప్పుడు ఒకటికినాలుగు అనుమతులు తెచ్చుకుని కళాశాలలను నిర్వహించినవారు ఇప్పుడు విద్యార్థులు లేక వాటిని ఒకదాంట్లో మరొకటి విలీనం చేసి ఒక్కటిగా మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

సింగిల్ కాలేజీలకు దెబ్బే!
ఒక యాజమాన్యం కింద సింగిల్ కాలేజీ మాత్రమే ఉండి, ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉంటే ఇక ఆ కళాశాల మనుగడ కష్టమే. రాష్ట్రంలోనూ, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న డీమ్డ్ వర్సిటీల్లో మన విద్యార్థులు ఎక్కువగా చేరుతుండటం కూడా సగటు కాలేజీలను దెబ్బతీస్తోంది. అదే.. గ్రూపు కాలేజీల్లో అయితే కొంత వరకు ఫర్వాలేదు. ఒక కాలేజీలో సీట్లు భర్తీ కాకున్నా మిగిలిన కాలేజీల్లో సీట్లు భర్తీ అయితే ఎలాగో సర్దుబాటు చేసుకుంటారు. ఇక.. గత రెండేళ్లుగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల ఫలితంగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి విద్యార్థుల వలస తగ్గింది. ఆ ప్రభావం కూడాతెలంగాణ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు.

70% భర్తీ కాకుంటే కష్టాలే
నాలుగేళ్ల సీనియారిటీ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగు బ్రాంచ్‌లలో కలిపి కనీసం 1320 సీట్లు అందుబాటులో ఉంటాయి. అందులో కనీసం 800 నుంచి 1000 వరకు సీట్లు భర్తీ అయినప్పుడే ఆ కాలేజీని నిర్వహించటం సాధ్యమవుతుంది. కన్వీనర్, యాజమాన్య కోటాల్లో కలిపి అందుబాటులో ఉన్న సీట్లలో 70% సీట్లు భర్తీ అయితేనే ఏ ఇంజనీరింగ్ కాలేజీకైనా మనుగడ సాధ్యం. కానీ గణాంకాలు చూస్తే.. 2010లో దాదాపు 180 కాలేజీలకు, 2011లో దాదాపు 290 కాలేజీల్లో వయబిలిటీకి అవసరమైన సీట్లు భర్తీ కాలేదు. దీంతో ఆయా కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
=======================================================================








Please leave a comment if Links are not in work or You like the post thanks


No comments:

Post a Comment